Eluru:నిరంతర నిఘాలో స్ట్రాంగ్ రూంలు
జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతితో కలిసి స్ట్రాంగ్ రూం లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్..
ఏలూరు, మే,21: ఈవియం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిరంతర బంధోబస్తుతో పర్యవేక్షించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవిఎంలు భధ్రపరచిన వట్లూరు లోని సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవిఎంల స్ట్రాంగ్ రూమ్ లను మంగళవారం జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంయుక్తంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈవిఎంల భధ్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈవిఎంలకు కేంద్ర, రాష్ట్ర సివిల్ పోలీసులతో మూడంచెల భధ్రత కల్పించడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్ లకు ఉన్న తలుపులకు వేసిన తాళాలను వాటికున్న సీళ్లను, అన్నిచోట్లా సిసి కెమేరాల పనితీరును వారు క్షుణంగా పరిశీలించారు. మూడంచెలు గల కేంద్ర పోలీసు బలగాల గార్డును, జిల్లా ఆర్మ్ డ్ , సివిల్ పోలీస్ బంధోబస్తును వారు పరిశీలించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్ లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్ధితుల్లోను అనుమతించరాదన్నారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంతోపాటు చుట్టుప్రక్కల ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు.
జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజువరకు స్ట్రాంగ్ రూమ్ లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎటువంటి సమన్వయ లోపం రానివ్వకుండా ప్రత్యేక పోలీస్ అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ ల భధ్రతను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
వీరివెంట కైకలూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కె. భాస్కర్, యం. ముక్కంటి, పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు.