Bhimavaram:సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు అత్యంత బాధ్యతగా మెలగాలని, దీనికోసం నియమించిన కౌంటింగ్ సిబ్బందిని సమాయత్తం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు .

సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కౌంటింగ్ ఏర్పాట్లపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నుండి ఓట్ల లెక్కింపుకు అనుమతి పొందిన సిబ్బంది సంఖ్యకు మించి అదనంగా ఒక్కరిని కూడా వినియోగించడానికి వీలులేదన్నారు. కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుండి పూర్తయ్యే వరకు సిబ్బంది ఎవరు కౌంటింగ్ హాల్ ను వదిలి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదన్నారు. ప్రత్యేకంగా భోజన విరామం సమయం ఉండదని, కౌంటింగ్ హాల్లోనే విధుల్లో ఉన్న సిబ్బందికి ఆహారం అందించడం జరుగుతుందన్నారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాలకు పిలిచి
వారికి ముందుగానే కౌంటింగ్ ఏర్పాట్లను వివరించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కౌంటింగ్ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు, ప్రతి విషయాన్ని మరి ఒకసారి చెక్ చేసుకోవాలని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, తదితరులకు పాసులు జారీ జూన్ 2 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులకు, సిబ్బందికి, పోటీలో ఉన్న అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు, మీడియాకు ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ హాల్లోనికి సెల్ ఫోను, వాచ్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని, ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారులు కూడా తరచూ సంబంధితులకు తెలియజేయాలని ఆదేశించారు.
ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు, నియోజకవర్గాల నుండి రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in