ఆచంట:జూన్ 30,2024. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టరు సి.నాగరాణి అన్నారు…
ఆదివారం ఆచంట కమ్యూనిటీ హెల్త్ సెంటరును జిల్లా కలెక్టరు సి.నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు వైద్య విభాగాలను పరిశీలించారు. తొలుత డ్యూటీ రిజిస్టరును పరిశీలించి ఎంతమంది డ్యూటీలో ఉన్నారు అడిగి తెలుసుకున్నారు. తనిఖీ సమయంలో వైద్యాధికారి విధులలో లేకపోవడం గమనించి విధుల్లో లేకుండా ఎక్కడకు వెళ్లారు అని సిబ్బందిని ప్రశ్నించారు. ఓపి వార్డులను, ప్రసూతి వార్డులను పరిశీలించి, అక్కడ ఉన్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలు సౌకర్యాలను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే డెలివరీ కేసులు, ఓపి కేసులు, హాస్పటల్లో ఇన్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్యను ఆరా తీశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు చెందిన ప్రజలు ఎంతో నమ్మకంతో వైద్య సేవలకు వస్తారని, ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. అవసరమైన మందులను ఎప్పటికప్పుడు ఇండెంట్ ద్వారా తెప్పించుకొని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఎక్కువగా ఉందని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అతిసార వ్యాధి, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏదైనా డయోరియా కేసు నమోదు అయితే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. తాను తరచూ ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో లోపాలు కనిపించినా, రోగులు నుండి ఒక్క ఫిర్యాదు వచ్చినా సంబంధిత వైద్యాధి కారులను, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. విధుల యందు నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని గట్టిగా హెచ్చరించారు.జూలై 01 తేదీ నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వామ్యంతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ డయేరియా, తదితర సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించవలసిన బాధ్యత మీపై ఉందని జిల్లా కలెక్టరు సి.నాగరాణి తెలిపారు.
ఆకస్మిక తనిఖీలు సందర్భంలో హెడ్ నర్సు జి రుక్మిణి, ఫార్మసిస్ట్ రామకృష్ణ, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in