Free sand: జులై 07: జిల్లాలో ఈనెల 8వ తేదీ నుండి ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ప్రజాప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డీఎల్ఎస్‌సీ) సమావేశం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని వివిధ ఇసుక స్టాక్ పాయింట్లలో నిల్వలు, ఉచిత విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఉంగుటూరు మండలం చేబ్రోలు, కుక్కునూరు మండలం వింజరం , ఇబ్రహీంపేట స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. చట్టబద్ధమైన పన్నులు మరియు లెవీలతో పాటు కార్యకలాపాల ఖర్చు మాత్రమే వినియోగదారుల నుండి వసూలు చేయబడుతుందన్నారు. ప్రజల అవసరాల మేరకు ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ చెప్పారు. చేబ్రోలు (ఉంగుటూరు మండలం) స్టాక్ పాయింట్ వద్ద టన్నుకు 538 రూపాయలు, వింజరం (కుక్కునూరు మండలం) స్టాక్ పాయింట్ వద్ద టన్నుకు 362 రూపాయలు ,ఇబ్రహీంపేట (కుక్కునూరు మండలం) స్టాక్ పాయింట్ వద్ద 210 రూపాయలు చొప్పున ఛార్జీలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ మొత్తాన్ని రీచ్ ప్రాంత రహదారులు, ర్యాంపులు తదితరాల అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందన్నారు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి రోజుకు 20 టన్నుల లోపు వరకు మాత్రమే సరఫరా చేయాలన్నారు. ఇసుక నిల్వ కేంద్రాల వద్ద నామమాత్రపు రుసుం వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని మైన్స్ అండ్ జియాలజీ, రెవెన్యూ, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులు పటిష్ట అమలుకు కృషిచేయాలని… ఇందుకు ప్రణాళికాయుతంగా వ్యవహరించాలన్నారు. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటుచేయాలని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ స్టాక్ పాయింట్ల వద్ద డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు ఉంచాలని, అనధికారికంగా ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఉప రవాణా కమీషనర్ ఎస్. శాంతకుమారి, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ఆర్డీఓ లు ఎన్ .ఎస్.కె. ఖాజావలి , కె. అద్దయ్య , గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి. సునీల్ బాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి. శ్రీనివాసరావు, ప్రభృతులు పాల్గొన్నారు..
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in