Bhimavaram: జూలై 8,2024 సాధ్యమైనంత త్వరగా జిల్లాలోని ఇసుక రీచ్ లను వినియోగంలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నామని, అప్పటి వరకు జిల్లా వాసులు సమీపంలోని కోనసీమ. తూర్పు గోదావరి జిల్లాలలోని ఇసుక నిల్వ కేంద్రాల నుండి ఉచిత ఇసుక పొందవచ్చని పశ్చిమ గోదావరి కలెక్టర్ మరియు జిల్లా ఇసుక కమిటీ చైర్మన్ చెదలవాడ నాగరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఇసుక కేంద్రాలు భీమవరం, నర్సాపురం పట్టణాలకు 50- 60 కి.మీ.ల దూరంలో ఉన్నాయని, ఇవి జిల్లాలోని 5 మండలాలకు అతి సమీపంలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. నిడదవోలు మండలం పందలపర్రు కేంద్రంలో 52,082, పెరవలి మండలం పెండ్యాల కేంద్రంలో 1,46,249, ఉసులుమర్రులో 33,065 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు.
కోనసీమ జిల్లాలోని మూడు ఇసుక నిల్వ కేంద్రాలు 15-30 కి.మీ.ల దూరంలో, జిల్లాలోని 5 మండలాలకు అతి సమీపంలో ఉన్నాయన్నారు. రావులపాలెం మండలంలోని రావులపాడు-1 కేంద్రంలో 34,171, రావులపాడు-2లో 82,950, కొత్తపేట కేంద్రంలో 25,897 మెట్రిక్ టన్నులు సిద్దంగా ఉందన్నారు.
జిల్లాలోని ఆచంట, పెనుగొండ మండలాలలోని ఆరు ఓపెన్ ఇసుక రీచ్‌లు పనిచేయడంలేదని కలెక్టర్ సి.నాగరాణి వివరించారు. వీటికి వివిధ అనుమతులు పొందవలసి ఉందన్నారు. యలమంచిలి, నర్సాపురం ప్రాంతాలలో ఐదు డీ-సిల్టేషన్ పాయింట్లు ఉండగా, జలవనరుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుండి అనుమతులు తీసుకోవలసి ఉందన్నారు. ఈ నేపద్యంలో జిల్లాలోని ఆరు ఇసుక కేంద్రాలలో ఎటువంటి నిల్వలు లేవని కలెక్టర్ వివరించారు.
రేవుల వద్ద వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు, ప్రయాణ ఖర్చులు, ప్రభుత్వం వారికి చెల్లించవలసిన సీనరేజ్, జీఎస్టీ తదితర ఖర్చులు మాత్రమే ఉంటాయన్నారు. మైన్స్ అండ్ జియాలజీ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉన్నాయని, వినియోగదారులు తమ ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలను చూపి ఇసుక పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. వినియోగదారుడి నుంచి డిజిటల్ పేమెంట్ కు మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేసారు. ఒక వ్యక్తికి ఒక రోజులో కేవలం 20 టన్నులు మాత్రమే తీసుకు వెళ్ళడానికి అనుమతి ఉంటుందన్నారు. స్టాక్ పాయింట్ల నుండి ఉదయం 6.00 గం.ల నుండి సాయంత్రం 6.00 గం.ల వరకు మాత్రమే ఇసుకను పొందడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద వాహనాలలోకి లోడింగ్ చార్జీలు, ప్రభుత్వానికి చెల్లించవలసిన సీనరేజ్, తదితర ఖర్చులు చెల్లిస్తే సరిపోతుందని కలెక్టర్ స్పష్టంచేశారు.
రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in