Bhimavaram: జులై 09,2024. జిల్లాలో కుష్టువ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలని డిఆర్ఓ జె.భాస్కరరావు అన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు డిఆర్ఓ జె.ఉదయ భాస్కర్ రావు వివిధ శాఖల అధికారులతో కుష్టు వ్యాధి నిర్మూలనపై సమన్వయకమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో కుష్టువ్యాధి వ్యాప్తి చెందడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా, ఈనెల 18 నుంచి ఆగస్టు 2 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా వ్యాధిని చాలావరకు అరికట్టవచ్చునని, వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించవచ్చునని సూచించారు. దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఈ వ్యాధి కారణాలు, చికిత్స, నివారణా చర్యలను ప్రజలకు వివరించాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ పాఠశాలలో ప్రతీ విద్యార్ధినీ తనిఖీ చేసి, స్పర్శ లేని మచ్చలు, ఇతర లక్షణాలు ఏమైనా ఉంటే గుర్తించాలన్నారు. కుష్టువ్యాధిని ముందుగానే గుర్తించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చునని, అలాగే ఈవ్యాధిని ఎండిటి చికిత్సతో పూర్తిగా నయం చేయవచ్చునని సూచించారు. జిల్లాలోని ప్రతీ ఇంటిలో సర్వే జరగాలని స్పష్టం చేశారు. జిల్లా ఆసుపత్రులు కూడా తమవద్దకు వచ్చే రోగుల్లో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి, చికిత్స అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. సర్వే కోసం ఇంటివద్దకు వచ్చే ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి ప్రజలు పూర్తిగా సహకరించాలని, తమ దేహంపై స్పర్శలేని మచ్చలు, వ్యాధి ఇతర లక్షణాలు ఏమైనా ఉంటే వివరాలను వారికి తెలియజేసి, కుష్టురహిత జిల్లాగా మార్చేందుకు తమవంతు సహకారం అందించాలని డిఆర్ఓ కోరారు.
చివరిగా కుష్టు వ్యాధి సమాచార గోడ ప్రతులను డిఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
కుష్టువ్యాధి లక్షణాలు ఇవే ః
- చర్మంపై స్పర్శ, నొప్పి, దురద లేని మచ్చలు
- చర్మంపై ఎర్రని లేదా రాగిరంగు మచ్చలు
- చెవులపై, వీపుపై, ఎదపై నొప్పిలేని బుడిపెలు
- కనురెప్పలు పూర్తిగా మూయలేకపోవడం
- కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం
- నొప్పిగా ఉన్న నరములు
- చేతులు, పాదాలు, నరాల్లో తిమ్మిర్లు
- అరిచేతులు, పాదాలు స్పర్శ లేకపోవడం, పొడిబారిపోవడం
- చేతులు, పాదాల్లో నొప్పి తెలియని గాయాలు, పుండ్లు
- చేతివేళ్లు, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం
- చల్లని, వేడి వస్తువులను గుర్తించలేకపోవడం
- చేతులనుంచి వస్తువులు జారీపోవడం
- మణికట్టు లేదా మడమను పైకి లేపలేకపోవడం
- కాళ్లనుండి చెప్పులు జారిపోవడం
ఈ సమన్వయ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డి. ఉమామహేశ్వరరావు, జిల్లా సహాయ వైద్యాధికారి బి.భాను నాయక్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె. శోభారాణి, డి పి ఎమ్ ఓ సిహెచ్ ధనలక్ష్మి, టి హెచ్ వరల్డ్ ఎం ఓ ఎ.భరత్, డి ఎన్ టి ఎన్ ఓ లు కె.వి. శ్రీనివాసరావు, సిహెచ్ త్రిమూర్తులు, ఎంపి.రమేష్, వి.వెంకటేశ్వర్లు, జీ వి ఎస్ ఎన్ మూర్తి జె.రాంప్రసాద్, ఫిజియోథెరపి పి.వేణు, సెంటిమెరిస్ లెప్రసి సెంటర్ సిస్టర్ సెలీన్, ఎ.పెద్దిరాజు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ సి హెచ్ రంగసాయి, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in