Bhimavaram: జులై 09,2024 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాల మేరకు లబ్ధిదారులకు నూరు శాతం రుణాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి ఆదేశించారు .
మంగళవారం స్థానిక కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లంతా లక్ష్యాలను చేరుకోవడం చాలా ముఖ్యమని, రైతులు, మహిళలకు, వివిధ వర్గాల ప్రజలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కలిగించామనేది ఆలోచించాలని, కొన్ని బ్యాంకులు రుణాలు మంజూరులో తాత్సారం చేయడం తగదన్నారు. బ్యాంకులకు లక్ష్యాలు ఉంటాయని, రుణాల మంజూరులో నూరు శాతం లక్ష్యాలు చేరుకోవాలన్నారు. ముద్ర వీవర్స్ రుణాలకు సంబంధించి అన్ని బ్యాంకులు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులకు అందించే సిసిఆర్సి కార్డులకు సంబంధించి రుణాల మంజూరులో అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించాలన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ సెక్టార్లు, ఇతర పథకాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్య రుణాలు, వ్యవసాయ సదుపాయాలు, స్వానిధి, రివర్స్ రుణాలు, ఎంప్లాయిమెంట్ జనరేషన్ రుణాలు, పీఎంఈజీపి, విశ్వకర్మ, హార్టికల్చర్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల కోసం రుణాల మంజూరు, తదితర అన్ని రకాల పథకాల కింద పూర్తి స్థాయిలో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశానికి సంబంధించి సంవత్సరానికి సరిపడా ముందుగానే షెడ్యూల్ ని తయారు చేయాలని ఎల్డిఎంని ఆదేశించారు. ఇందులో ప్రణాళిక ప్రకారం చర్చించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కమిటీలో చేయాల్సిన పనులు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై బ్యాంకర్లంతా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 2023-24 రుణ ప్రణాళికలో నిర్దేశించిన విధంగా విద్య, గృహ రుణాల లక్ష్యాలను సాధించలేకపోవడంపై బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. 2024-25 వార్షిక రుణ ప్రణాళికలో గత సంవత్సరంలో మిగిలిన లక్ష్యాలను కలుపుకొని ప్రగతిని సాధించాలని తెలిపారు.
జిల్లాలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు అనుమతి.. జిల్లా కలెక్టర్
జిల్లా విభజన అనంతరం పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ప్రత్యేకంగా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేయుటకు అనుమతిని మంజూరు చేయడం జరిగిందన్నారు. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇనిస్టిట్యూట్ నిర్మాణ పనులు జరుగుతాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తుందని తెలిపారు. యువతలో నైపుణ్య అభివృద్ధిని పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ శిక్షణా సంస్థ ఉపయోగంగా ఉంటుందన్నారు.
బ్యాంకర్ల సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎ.నాగేంద్రప్రసాద్, ఆర్.బి.ఐ ఏజీఎం ఆర్.హనుమంత కుమారి, యూబిఐ డిప్యూటీ రీజనల్ హెడ్ వెంకన్న బాబు, నాబార్డ్ డిడి టి.అనిల్ కాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in