Eluru July12:జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాధాన్యత అంశాలకు సంబంధించి స్పష్టతతో కూడిన సమగ్ర సమాచారంతో ఈనెల 15వ తేదీ సోమవారం నిర్వహించే జిల్లాస్ధాయి సమీక్షా సమావేశానికి సిద్ధం కావాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.
శుక్రవారం స్ధానిక గోదావరి సమావేశ మందిరంలో ఈనెల 15వ తేదీన నిర్వహించే జిల్లాస్ధాయి సమీక్షా సమావేశంనకు సంబంధించి సంబంధిత అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖాపరంగా సమగ్ర సమాచారాన్ని నియోజకవర్గాల వారీగా వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై పూర్తి సమాచారం అందించే దిశగా సిద్ధం కావాలన్నారు. ఈ సందర్బంగా ఆయా శాఖల వారీగా పెండింగ్ పనులు, త్రాగునీటి వ్యవస్ధ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ, వైద్య ఆరోగ్య సేవలు, వ్యవసాయ, వాటి అనుబంధ శాఖలు, పారిశుధ్యం నిర్వహణ, విద్య, రహదారులు, ఉపాధికల్పన, తదితర అంశాలపై సంబంధిత అధికారుల వారీగా కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు.
వరదలపై అప్రమత్తంగా ఉండండి….
గోదావరి నది ఎగువన వర్షాలు కురుస్తున్నందున రానున్న వారంలో గోదావరి వరద పెరిగే అవకాశాలను దృష్టిలో వుంచుకొని అందుకు తగిన విధంగా ముందస్తు జాగ్రత్తల చర్యలతో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె. వెట్రిసెల్వి దిశా, నిర్ధేశం చేశారు. పౌర సరఫరాలు, ఆర్ డబ్ల్యూఎస్, అగ్నిమాపక విభాగం, విద్యుత్, ఇతర అత్యవసర సేవల శాఖల అధికారులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యచరణతో సిద్ధంగా ఉండాలన్నారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి…
గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో వస్తున్న అంతరాయాలపై ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజును జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఇందుకు గల కారణాలను వివరించాలన్నారు. తరచూ సంభవిస్తున్న విద్యుత్ సరఫరాల అంతరాయాలపై సమగ్ర తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. అదే విధంగా వివిధ అంశాలపై పత్రికల్లో ప్రచురితుమవుతున్న ప్రతికూల వార్తలపై స్పందిస్తూ సకాలంలో పరిష్కార చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సందర్బంలో సంబంధిత మెరిట్ లిస్టులను వివరాలను పొంది కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను ప్రలోభాలకు గురిచేసి డబ్బులు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, డబ్పులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభపెట్టేవారిపట్ల యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతిభవున్న యువతకు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ పంచాయితీల్లో స్ధలాలు ఆక్రమణకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. పంచాయితీల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా టీం లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా స్ధలాలు అన్యాక్రాంతం అవుతుంటే వెంటనే విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సర్వేకు సంబంధించి ఎఫ్ లైన్ పెండింగ్ లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఐటిడిఎ పివో యం. సూర్యతేజ, జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం. ముక్కంటి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in