Eluru:
ఏలూరు నగరంలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. నేషనల్ క్లియర్ ఎయిర్ ప్రోగ్రాం కింద కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వాయుకాలుష్య నియంత్రణ అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని వాయుకాలుష్యం కలిగిన నగరాలలో కాలుష్య నియంత్రణకు ప్రణాళికబద్దముగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినదన్నారు. వాటిలో ఏలూరు నగరం ఒకటని, ఏలూరు వంటి చిన్న స్థాయి నగరంలో వాయు కాలుష్యం వ్యాపించడంపై మూలకారణాలు తెలుసుకుని, వాటిని నియంత్రించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాలికను రూపొందించి వెంటనే సమర్పించాలని కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా కాలుష్య నియంత్రణకు ఏలూరు నగరంలో పెద్దఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని, వాహనాల ద్వారా కాలుష్యం వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో తడి, పొడి చెత్తల నిర్మూలన విధానాన్ని నిబంధనల ప్రకారం చేయాలన్నారు. వాహనాలకు వినియోగించే ఇంధనం కల్తీ లేకుండా చూడాలని, ప్రతీ పెట్రోల్ బంక్ లలో సరఫరా అయ్యే ఇంధనం నిబంధనల మేరకు ఉన్నదా లేదా అన్నది అధికారులు తనిఖీ చేయాలన్నారు. వాహనాలు కూడా నిర్దేశించిన కాలుష్యాన్ని విడుదల చేస్తున్నది అనేది పరిశీలించాలన్నారు. ఏలూరు నగరంలో వాయు కాలుష్యం వ్యాప్తి చెందే ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వాయు కాలుష్య నియంత్రపై తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు కూడా అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సమావేశానికి హాజరు కానీ అధికారులకు షోకాజ్ నోటీసులు: కలెక్టర్ జిల్లాలో పలు సమీక్షా సమావేశాలకు జిల్లా స్థాయి అధికారులు హాజరుకావడం లేదని ఇది సరైన పద్ధతి కాదని కలెక్టర్ చెప్పారు. కొంతమంది జిల్లా అధికారులు తాము సమావేశానికి హాజరు కాకుండా తమ కింద స్థాయి అధికారులను సమావేశాలకు పంపిస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు సమావేశానికి హాజరు నుండి మినయయింపునకు అనుమతి తీసుకోవలసి ఉందన్నారు. సమావేశానికి హాజరు కానీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. వెంకటేశ్వరరావు, కన్సల్టెంట్ ఏ . కోమలి, సామజిక వన విభాగం జిల్లా అటవీ శాఖాధికారి ఎం. హిమశైలజ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్.ఎస్.సత్యనారాయణ రాజు, జిల్లా పరిశ్రమల అధికారి వి. ఆదిశేషు, ఆర్టీవో శ్రీహరి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి. శైలజ, రహదారులు భవనాల శాఖ ఈ ఈ కిషోర్ బాబూజీ, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in