Grama Sabha:ఏలూరు, ఆగష్టు, 19 : ఈనెల 23వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటుచేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద చేపట్టవలసిన పనులను చర్చించి తీర్మానిస్తామని జిల్లా పంచాయతీ అధికారి
తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా చేపట్టవలసిన పనులపై రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ కార్యదర్సులతో కలిసి రాష్ట్రంలో జిల్లాపరిషత్ సీఈఓ, పంచాయతీరాజ్, డ్వామా, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని రాష్ట్రంలో మరింత సమర్దవంతంగా అమలు చేసి, గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టి మన రాష్ట్రాన్ని దేశంలో ప్రధమ స్థానంలో నిలిపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామాలలోనూ గ్రామ సభలు ఏర్పాటుచేసి, ఆయా గ్రామాలలో 2024-25 సంవత్సరంలో చేపట్టవలసిన పనులపై గ్రామస్థులను భాగస్వాములను చేయాలనీ, వారితో చర్చించి, వారు కోరిన పనులు చేపట్టేలా తీర్మానం చేయాలన్నారు. గ్రామ సభలను ‘నామ్ కే వాస్తే’ లా కాకుండా ఆ గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని, ఆ గ్రామంలో వారికి అవసరమైన పనులు ప్రతిపాదించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి అని బాపూజీ కన్న గ్రామ స్వరాజ్య స్థాపన స్పూర్తితో గ్రామ సభల నిర్వహణ జరగాలన్నారు. ఉపాధి హామీ పనులలో ఎటువంటి అవినీతికి తావులేకుండా పారదర్శకత, జవాబుదారీతనంతో నిర్వహించాలన్నారు. సామజిక తనిఖీలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి విచారణ చేసి, చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ , వికసిత్ ఆంధ్రప్రదేశ్ స్పూర్తితో జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పధకంలో పనులు గుర్తించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రివర్యులు సూచనల మేరకు ఈనెల 23 న జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఉపాధి హామీ పధకంలో 4 విభాగాలలో పనులు గుర్తిస్తామన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె. ఎస్. ఎస్. సుబ్బారావు, డ్వామా పీడీ రాము, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీడీ రవికుమార్, ఉద్యానవనాలు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in