Agiripalli:ఏలూరు/అగిరిపల్లి, జులై, 1 : రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీని 15 రోజులలో నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
అగిరిపల్లి లో సోమవారం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పార్థసారధి స్వయంగా లబ్దిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, పేదల సంక్షేమానికి ఎన్నికలలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం 2 వేల రూపాయల పెన్షన్ 3 వేల రూపాయలకు పెంచేందుకు 5 సంవత్సరాలు సమయం తీసుకుందని, కానీ తమ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను 15 రోజులలోనే 3 వేల రూపాయల నుండి 4 వేల రూపాయలకు పెంచిందన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల 18 వేల మంది లబ్దిదారులకు 4408 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు. ప్రజలను కలవరపాటుకు గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు పెంపొందింపచేస్తామన్నారు. రాష్ట్రంలో 183 అన్నా కాంటీన్లను ఆగష్టు, 16వ తేదీన ప్రారంభిస్తామన్నారు. అగిరిపల్లి మండలంలో 9855 మంది పెన్షన్ లబ్దిదారులకు 6. 65 కోట్ల రూపాయలను అందిస్తున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులకు 3 వేల నుండి 6 వేల రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 5 వేల నుండి 10 వేల రూపాయలకు, పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడుతూ మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నవారికి 5 వేల నుండి 15 వేల రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. ఇకనుండి ప్రతీ నెల 1వ తేదీనే పెన్షన్ లబ్దిదారులకు వారి ఇంటివద్దే పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారిలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామన్నారు.
కార్యక్రమంలో నూజివీడు ఇంచార్జి ఆర్డీఓ ఎం. ముక్కంటి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in