Agiripalli August 02 : ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణను నేటి యువతకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
ఆగిరిపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు విద్యా కానుక పాఠ్య పుస్తకాలను మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన మానవవనరులు అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని , ఎంత ఉన్నత చదువులు చదివినప్పటికీ సరైన నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు సక్రమంగా రావన్నారు. గత 5 సంవత్సరాలలో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. జీవితంలో స్థిరపడాలంటే విద్యా ఒక్కటి మాత్రమే సరిపోదని, చదివిన విజ్ఞానానికి, నైపుణ్యం తోడైతే అటువంటి యువతకు మంచి భవిష్యత్తు లభిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నమ్మిన సిద్దాంతమన్నారు. రాష్ట్రంలోని యువతకు ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించేందుకు రాష్ట్ర విద్యా, ఐ.టి. శాఖల మంత్రి నారా లోకేష్ కృషిచేస్తున్నారని, త్వరలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలలో శిక్షణ అందించి యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించనున్నారని మంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల స్థాయి ని పెంచి, ప్రజలకు నమ్మకం కలిగిలే చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
కార్యక్రమంలో ఆర్ ఐ ఓ ప్రభాకర్, మండల విద్యా శాఖాధికారి సర్వేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ కె. యోహాన్, గ్రామ సర్పంచ్ బి. లక్ష్మి, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in