Bhimavaram:భీమవరం: జూన్ 02,2024 జూన్ 4 నిర్వహించే ఓట్ల లెక్కింపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు.
వెలగపూడి ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆదివారం సాధారణ ఎన్నికలు – 2024 కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల సంబంధిత సమస్యలు, ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు, ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, తదితరులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్, ఈటిపిబిఎస్, పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు, ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారిగా ఫలితాల ట్యాబులేషన్ మరియు ఎన్కోర్ లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టేట్యూటరీ నివేదిక, రౌండ్ వైస్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం మరియు మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు 100 శాతం పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ భీమవరం ఎస్ ఆర్ కె ఆర్, విష్ణు కళాశాలలో ఏర్పాటుచేసిన పార్లమెంట్ నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టామన్నారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత చేపట్టాల్సిన కార్యకలాపాలపై అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సజావుగా కౌంటింగ్ ప్రక్రియను చేపట్టేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని, అన్ని రకాల ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ ప్రకారం నడుచుకోవాలని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు పలు పర్యాయాలు సమావేశాలు పెట్టి వారికి కౌంటింగ్ అంశాలు వివరించామని, అభ్యర్థులు, ఏజెంట్లకు ఐడి కార్డులు, వాహనాల పాసులు గురించి తెలియజేశామన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, ఎన్నికల పర్యవేక్షకులు, భీమవరం రిటర్నింగ్ అధికారి కె.శ్రీనివాసులు రాజు, చందన దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in