Bhimavaram:భీమవరం: జూన్ 1,2024 ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
విష్ణు ఇంజనీరింగ్ కళాశాల, ఎస్ ఆర్ కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను, మీడియా సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. తొలుత విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని, మీడియా సెంటర్ ను పరిశీలించారు. మీడియా సెంటర్ లో హై స్పీడ్ ఇంటర్నెట్, వైఫై కనెక్టివిటీ, టెలివిజన్లు ఏర్పాటు తదితర అంశాలపై తగు సూచనలను సంబంధిత అధికారులకు జారీచేసారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్, సిట్టింగ్ ఏర్పాట్లును పరిశీలించి ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
అనంతరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఉండి నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యతో కలిసి పరిశీలించారు. టేబుల్స్ అమరిక, రౌండ్ ల వారి వివరాల ప్రొఫార్మాలు, ఎన్ కోర్ లో డేటా నమోదు, అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ హాలుకు చేరుకునే మార్గాలు తదితర విషయాలపై ఉండి రిటర్నింగ్ అధికారితో చర్చించి పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు లోపలికి వెళ్లే మార్గాలకు సూచిక బోర్డులు స్పష్టంగా ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అఫీషియల్ కమ్యూనికేషన్, పబ్లిక్ కమ్యూనికేషన్, మీడియా సెంటర్ లను ఏర్పాటు చేశామన్నారు. కళాశాల ప్రవేశ ద్వారం నుంచి 100 మీటర్ల లోపు వాహనాలకు అనుమతి లేనందున, గుర్తింపు కార్డులు కలిగిన వ్యక్తులకు ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. వాహనాలకు పార్కింగ్ జోన్ సిద్ధం చేశామన్నారు. బ్యారికేడ్లు ఏర్పాటు వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైసులు లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బంది ఉదయం 5.30 గంటలకే ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవిన్యూ అధికారి జె. ఉదయ భాస్కరరావు, ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులు చందన దుర్గాప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ మర్రాపు సన్యాసిరావు, తదితరులు ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in