Bhimavaram:భీమవరం: జూన్ 2,2024: ఈనెల 4 నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎం.దీప తెలిపారు
ఆదివారం స్థానిక ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎం.దీప జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎం.దీప మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బంది అప్రమత్తంగా తమకు కేటాయించిన పనులలో ప్రధాన భూమికను పోషించి విధులను నిర్వర్తించాలని సూచించారు. విధులలో పాల్గొన్న సిబ్బంది బాధ్యతాహితంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులకు ప్రతీ రౌండ్ కీలకమని పేర్కొన్నారు. ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని, ఎక్కడా పొరపాట్లు దొర్లకూడదని సూచించారు. అభ్యర్ధుల వారీగా వచ్చిన ఓట్లను ఏజెంట్లకు చూపించాలని, వారినుంచి సంతకాలు తీసుకోవాలని చెప్పారు. ఈవిఎం మిషన్లను తీసుకువచ్చేటప్పుడు, ఓట్లను లెక్కించేటప్పుడు మిషన్లు పాడవ్వకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. జూన్ 4వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకే కౌంటింగ్ సిబ్బంది ఆయా కౌంటింగ్ కేంద్రాలకు కచ్చితంగా చేరుకోనే చూడాలన్నారు. ఎలాంటి సందేహాలు అనుమానాలు ఉన్నా కూడా వెంటనే వాటిని నివృత్తి చేసుకోవాలన్నారు. విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి అయ్యేవరకు బాధ్యతాయుతంగా తమ విధులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆర్వోలను సూచించారు.
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఉండి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సీవీ ప్రవీణ్ ఆదిత్య, భీమవరం ఆర్డీవో మరియు భీమవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కే శ్రీనివాసులు రాజు, తాడేపల్లిగూడెం ఆర్డీవో మరియు రిటర్నింగ్ అధికారి కే చెన్నయ్య, తదితరులు ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in