Bhimavaram:భీమవరం: జూన్ 3,2024: ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను
ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా కౌంటింగ్ పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు .
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఏఆర్ఓలు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లుకు భీమవరం విష్ణు కాలేజీ లైబ్రరీ హాల్ నందు సోమవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బ్యాలెట్ లెక్కింపుపై సంబంధిత అధికారులకు ఏవిధమైన అవగాహన వుందో తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్లి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి, వారు వెలిబుచ్చిన పలు అంశాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణ ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించిన అంశాలను క్షుణంగా తెలుసుకొని జూన్ 4వ తేదీన కౌంటింగ్ లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.
తొలుత జిల్లా కలెక్టర్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో ఫారం-13సి, ఫారం-13ఎ, ఫారం-13బి లకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. వాటిపై సంపూర్ణ అవగాహన కలిగియుండాలన్నారు. అలాగే సర్వీస్ ఓటర్లకు సంబంధించి బ్యాలెట్ల లెక్కింపులో పూర్తి జాగ్రత్త వహించి మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయాలన్నారు. ఎలాంటి సొంత అలోచనలకు తావివ్వకుండా ఎన్నికల నిబంధనలను విధిగా పాటించి ఓట్లలెక్కింపు నిర్వహించాలన్నారు.
కార్యక్రమంలో డిఆర్ఓ జె. ఉదయ భాస్కరరావు, ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులు చందన దుర్గాప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ మర్రాపు సన్యాసిరావు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in