Bhimavaram:భీమవరం: జూన్ 18,2024 జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు రక్షణ చర్యలను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం స్థానిక వశిష్ట సమావేశ మందిరం నందు ఇరిగేషన్ అధికారులతో సమావేశమై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వరద నియంత్రణలో భాగంగా చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. మొదటి ప్రమాద హెచ్చరిక వరకు ఇబ్బందిలేదని, రెండో ప్రమాద హెచ్చరికలో 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే ఏయే ప్రాంతాలు, ఎన్ని కుటుంబాలు ప్రభావితం అవుతాయి, తీసుకోవలసిన ముందస్తు చర్యలపై అధికారులను ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాలైన బాడవ, వైవిలంక, యలమంచిలి లంక, లక్ష్మీపాలెం, కోడేరులంక తదితర గ్రామాల ప్రజల నుండి వరదలు నియంత్రణకు ఏయే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అనే సమాచారాన్ని సేకరించాలన్నారు. పెనుగొండ, మొగల్తూరు, ఆచంట, నరసాపురం, యలమంచిలి మండలాల్లోని కొన్ని గ్రామాలు వరద ప్రభావం ఉంటుందని, భద్రాచలం నుండి విడుదలయ్యే నీటిని అంచనగా తీసుకుని ముందుగా ఏ మండలాల్లోని ఏయే గ్రామాలలో నీరు చేరవచ్చో ఆయా గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వరద నియంత్రణకు వినియోగించే సామాగ్రి నిల్వలను అడిగి తెలుసుకున్నారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవుట్ ఫాల్ స్లూయిస్ మరమ్మతులు, ఏటిగట్ల పటిష్టతకు అవసరమైన నిధులు మంజూరుకు ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, భద్రాచలం నుంచి గోదావరికి నీరు చేరుకునే మార్గాలు, చివరగా సముద్రంలో కలిసే ప్రాంతం తదితర వివరాలను మ్యాప్ లను పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె. ఉదయ భాస్కరరావు, డ్రైనేజీ ఈఈ ఎం.వి.వి కిషోర్, హెడ్ వాటర్ వర్క్స్ నరసాపురం ఏఈ కె.వి.సుబ్బారావు, సిద్ధాంతం ఏఈ జీడి పవన్ కుమార్, కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ చందన దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in