Bhimavaram:భీమవరం: మే 26,2024. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎంతో కీలకం, ఓట్ల లెక్కింపుకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు అన్ని విధాలా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు సెంటర్ల నందు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉదయం 8.00 గంటలకే మొదలవుతుందన్నారు. మొదట పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని, అనంతరం ఏడు నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందన్నారు.
నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుకు 10 టేబుళ్ళు ఏర్పాటుకు తొలుత అనుమతి పొందగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికంగా పోలైనందున మరో ఐదు టేబుల్స్ ఏర్పాటుకు ఎలక్షన్ కమిషన్ నుండి అనుమతి పొందడం జరిగిందన్నారు. మొత్తం 15 టేబుల్స్ ను పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు వినియోగించడం జరుగుతుందన్నారు. 15 టేబుల్స్ కు సంబంధించి అదనంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు కూడా ఈసీఐ నుండి అనుమతి పొందడం జరిగిందన్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్ నందు అనుమతి పొందిన నాలుగు టేబుల్స్ నందు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాస్తవ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ రెండు కవర్లు ఉంటాయని, బయటి కవర్ను ఫారం 13-సి అంటారని దానిని తెరిచిన తర్వాత రెండు డాక్యుమెంట్లు ఉంటాయని అందులో ఒకటి డిక్లరేషన్ 13-ఏ అంటారని, ఇంకొకటి 13-బి కవరు లో నిజమైన పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి గతంలో ఉన్న ఉత్తర్వులను అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు కొంత వెసులుబాటు కల్పిస్తూ సవరణలతో మే 25న మరియొక ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి డిక్లరేషన్ 13-ఏ లో ఓటర్ తప్పనిసరిగా సంతకం చేసి ఉండాలన్నారు. ఫామ్-13 Aలో ఓటర్ సంతకం లేనివాటిని, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేని వాటిని తిరస్కరించడం జరుగుతుందన్నారు. ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందన్నారు. ఆర్వో సీల్ లేకున్నా తిరస్కరించవద్దన్నారు. ఫామ్-13A పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలన్నారు. ఆర్వో సంతకం సహా బ్యాలెట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్, కౌంటర్ ఫైల్స్ తో సరిపోల్చుకోవాలని సూచించారు- అంతేకాకుండా గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేసి స్టాంపు వేయడం గాని లేదా హోదా గాని రాసి ఉండాలన్నారు. అలా ఉంటేనే అది చెల్లుబాటు అవుతుందన్నారు. ఏవైనా ఓట్లు చెల్లుబాటు కాకపోతే 13-సి కవర్లో ఉంచి తిరస్కరిస్తూ వేరుగా పెట్టెలో ఉంచడం జరుగుతుందన్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుందన్నారు. ఒక్కో టేబుల్ కు 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి టేబుల్ కు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అలాగే పార్లమెంటు రిటర్నింగ్ అధికారి వద్దనే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ (ఈటీపిబిఎస్) లను కూడా లెక్కించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఒక టేబుల్ను ఏర్పాటు చేస్తామని ఆ టేబుల్ వద్ద కూడా పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఏజెంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు.
ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని, స్ట్రాంగ్ రూముల నుండి 14 కంట్రోల్ యూనిట్లను తీసుకువస్తామని అన్ని టేబుళ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఒక రౌండ్ పూర్తయినట్లుగా ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి పరిశీలకుల ఆమోదంతో ప్రకటిస్తారన్నారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలలో పోలైన ఓట్ల వివరాలను అభ్యర్థులు గాని ఏజెంట్లకు గాని ప్రతి టేబుల్ వద్ద చూపించడం జరుగుతుందన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే చెప్పాలని అంతా పూర్తయ్యాక అభ్యంతరం చెప్పడానికి వీలు లేదని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి వద్ద కూడా ఒక కౌంటింగ్ ఏజెంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు గాని లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు గాని ఎట్టి పరిస్థితులలో అనుమతించేది లేదన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి ప్రతినిధులు వారి అనుచరులకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి గొడవలు గాని దౌర్జన్యాలు హింసకు పాల్పడే విధంగా గాని చేయరాదన్నారు. గెలిచిన తర్వాత ఊరేగింపులకు గాని, డీజేలు లౌడ్ స్పీకర్లకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటింగ్ ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రానికి జూన్ నెల 4వ తేదీ ఉదయం 7.00 గంటల లోపుగా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు రిపోర్ట్ చేయవలసి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ లైటర్ కానీ, పదునైన వస్తువులు, ఎటువంటి ఆయుధాలతో ప్రవేశించరాదన్నారు. ఓట్ల లెక్కింపు కోసం వచ్చే వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లు కోసం, వారి వాహనాల కోసం ముందస్తుగా అనుమతి పత్రాలు పొందాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చే వారు ఎటువంటి మత్తు పానీయాలు సేవించరాదన్నారు. విజయం సాధించిన అభ్యర్థులు ఇతర అభ్యర్థులను ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడరాదన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత ఏజెంట్లను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపుటకు రిటర్నింగ్ అధికారికి సర్వహక్కులు ఉన్నాయన్నారు. అట్టి వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in