Bhimavaram:రహదారుల నిబంధనలపై యువతకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నాగరాణి రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ సి.నాగరాణి రవాణా శాఖ అధికారులతో సమావేశమై రహదారుల భద్రతా అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నాగరాణి మాట్లాడుతూ పెద్ద ఎత్తున రహదారుల భద్రతపై దృష్టి సారించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. ఎక్కువగా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపడం గమనించడం జరిగిందని, అట్టి వారికి తొలుత అవగాహన కల్పించి, అనంతరం చర్యలు చేపట్టాలన్నారు. హైవేలపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపుదల చేయడంవలన ప్రమాదాలకు కారణం అవుతున్నాయని, వాహనాలను నిర్దేశించిన ప్రాంతంలోనే నిలుపుదల చేసేలా పర్యవేక్షించాలన్నారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ తనిఖీలను ఎప్పటికప్పుడు చేయాలని, డ్రైవర్ల వివరాలను కూడా సేకరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పక తీసుకోవాలన్నారు. జిల్లాలోని కళాశాలల్లో రహదారులు భద్రతా నిబంధనలపై పెద్ద పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె ఎస్ ఎన్ ప్రసాద్, డి ఎస్ ఎస్ నాయక్, ఎం వెంకటేశ్వరరావు, ఏఎంవిఐలు రవికుమార్, సుబ్బలక్ష్మి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in