Eluru:ఏలూరు, మే, 24 : ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాద సమయంలో ఆస్థి, ప్రాణ నష్టాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలలో మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ లోని రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ సందర్శించి అగ్నిమాపక వాహనాలు, వాటర్ బోట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాద సమయాలలో అందించే అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎనలేనివన్నారు. వేసవిలో ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందించి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిని నివారించడం కంటే ముందు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రానున్న వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను కాపాడేందుకు అవసరమైన వాహనాలు, బోట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో వరదల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ సిబ్బంది గొప్ప సేవలందించారని, వారి సేవల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా నివారించగలిగామన్నారు.
జిల్లా ఫైర్ ఆఫీసర్ సిహెచ్. రత్నబాబు మాట్లాడుతూ జిల్లాలో 6 రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖల కార్యాలయాలు ఉన్నాయని, వాటిలో 8 అగ్నిమాపక నివారణ వాహనాలు ఉన్నాయన్నారు. అత్యవసర పరిస్థితిలో వినియోగానికి యంత్రపరికరాలు, వాటర్ బోట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై జిల్లాలోని పరిశ్రమలు, ప్రజా నివాస ప్రాంతాలలో డెమో ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు.
అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ వి. రామకృష్ణ, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in