Eluru:ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపుకు పకడ్బందీగా ఏర్పాట్లు
భద్రతాపరంగా అన్ని చర్యలు స్ట్రాంగ్ రూమ్ లను, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి
ఏలూరు, మే,31:సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపును పటిష్టమైన భధ్రతా చర్యల మధ్య పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు విస్త్రృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.
శుక్రవారం స్ధానిక సర్. సి.ఆర్. ఆర్. కళాశాలలో భధ్రపరచిన ఈవిఎంల స్ట్రాంగ్ రూమ్ లను, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. వీరి వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, అడిషనల్ ఎస్పీ స్వరూపరాణి, ఐటిడిఎ పివో యం. సూర్యతేజ, డిఆర్ఓ డి. పుష్పమణి తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా స్ట్రాంగ్ రూమ్ ల భధ్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబంధిత రిజిస్టర్ లో సంతకం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 14 చొప్పున పార్లమెంటుకు, అసెంబ్లీకి కలిపి 28 టేబుల్స్ ను ఏర్పాటు చేయడమైనదన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ఆయా నియోజకవర్గాలకు అనుగుణంగా రెండు నుంచి మూడు టేబుల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి రెండు విధాలైన పోస్టల్ బ్యాలెట్ లు లెక్కింపు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంభంధించి ప్రత్యేక హాలులో పోస్టల్ బ్యాలెట్ ను లెక్కింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో సుమారు 17 వేల పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు చేయవలసి
వుంటుందన్నారు. దీనిని రెండు, మూడు రౌండ్లలో పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా నియోజకవర్గాలను ఓట్ల లెక్కింపుకు సంబంధించి 16 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తిచేసే దిశగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈవిఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ఈవియం లోని ఓట్ల పూర్తి ఫలితాలు అందించేందుకు, సుమారు సా.5.00 గంటల లోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పూర్తి ఫలితాలు అందించాలనే దిశగా ప్రణాళిక సిద్దం చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఇప్పటికే మూడంచెల భధ్రతా ఏర్పాట్లుతో నిరంతర నిఘా కొనసాగుతున్నదన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి పారదర్శకంగా ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జరుగుతుందని ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు, అనుమానాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ల పరిశీలనలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
వీరి వెంట రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్ కె ఖాజావలి, వై. భవానీ శంకరి, కె. భాస్కర్, కె. అద్దయ్య, యం. ముక్కంటి, తదితరులు ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in