Read Time:4 Minute, 12 Second
Eluru:ఏలూరు జిల్లాలో ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు సంసిద్ధంగా ఉన్నాం: సీఈఓ కి తెలియజేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్వో లతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్
ఏలూరు, జూన్, 2 : ఏలూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంసిద్ధంగా ఉన్నామని, పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేసారు. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆదివారం జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సెక్రటేరియట్ లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి , ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ, డిఆర్ఓ డి. పుష్పమణి, రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమ, నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దని, రౌండ్ల వారీగా ఖచ్చితమైన ఫలితాలను నిర్దేశించిన ప్రొఫార్మాలలో ఎన్నికల కమిషన్ కు నివేదికలను ఆన్లైన్ ద్వారా పంపించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రంలో అత్యవసర పరిస్థితులలో బయటకు వచ్చేందుకు అత్యవసర ద్వారం ఏర్పాటుచేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లను సీఈఓ కు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలియజేస్తూ, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటుచేయడం జరిగిందని, ప్రతీ కౌంటింగ్ హాలులో 28 టేబుల్స్ ఏర్పాటుచేయడం జరిగిందని, వాటిలో 14 టేబుల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి, 14 టేబుల్స్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. పోలైన ఓట్ల సంఖ్యను అనుసరించి 16 నుండి 21 రౌండ్ల వరకు కౌంటింగ్ జరుగుతుందన్నారు. జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్రం వద్ద 200 మీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్త్ ఏర్పాట్లు చేశామన్నారు.
జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, రిటర్నింగ్ అధికారులు ఎన్ .ఎస్. కె. ఖాజావలి, కె. అద్దయ్య , ఎం. ముక్కంటి, భాస్కర్, వై. భవానిశంకరి, డిప్యూటీ కలెక్టర్ కె. బాబ్జి, కలెక్టర్ పరిపాలనాధికారి కె. విశేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.