Read Time:3 Minute, 57 Second
Eluru:కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6 గంటలకల్లా హాజరుకావాలి జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి వచ్చే సిబ్బంది ముందురోజే వచ్చేలా చర్యలు: ఆర్వోలకు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశం
ఏలూరు, జూన్, 2 : కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది 4వ తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సెంటర్ కు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులతో ఆదివారం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ కౌంటింగ్ విధులు కేటాయించబడిన సిబ్బంది 4వ తేదీ ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకునేలా ఆర్ ఓ లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, తదితర ప్రాంతాల నుండి కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది ఈ సమయానికి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోడానికి వీలుకాదని, కావున అటువంటి వారిని గుర్తించి, వారితో ఫోన్ ద్వారా సంప్రతించి, వారిని ముందురోజే ఏలూరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, వారికి అవసరమైన భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని ఆర్వో లను కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దన్నారు. కౌంటింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు చేయవలసిన విధులకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై చెక్ లిస్ట్ లను రూపొందించి వారికి అందించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి టెన్షన్ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ సాగేలా రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరూ విజయయాత్రలు, ర్యాలీలు చేసేందుకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రంలో అత్యవసర పరిస్థితులలో బయటకు వచ్చేందుకు అత్యవసర ద్వారం ఏర్పాటుపై పరిశీలన చేయాలని జిల్లా ఫైర్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి , ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ, డిఆర్ఓ డి. పుష్పమణి, జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, రిటర్నింగ్ అధికారులు ఎన్ .ఎస్. కె. ఖాజావలి, కె. అద్దయ్య , ఎం. ముక్కంటి, భాస్కర్, వై. భవానిశంకరి, డిప్యూటీ కలెక్టర్ కె. బాబ్జి, కలెక్టర్ పరిపాలనాధికారి కె. విశేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in