Eluru: జులై, 09:ఏలూరు జిల్లా, పశ్చిమ బెంగాల్ హౌరా కి చెందిన డిసిపియు, పోలీస్, ఐసిడియస్, సిడబ్ల్యూసి సిబ్బంది కృషితో మూడు సంవత్సరాల తర్వాత ఓ బాలుడు తన కన్న తల్లి వద్దకు తిరిగి చేరిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలానికి చెందిన ఓ 12 సంవత్సరాల బాలుడు అలిగి 2021లో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయితే కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయినా తల్లి ఎవరికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఎవరైనా అడిగిన, బంధువుల ఇంటికి వెళ్ళాడు అని చెప్పేది. అయితే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ బాలుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా రైల్వే స్టేషన్లో ప్రత్యక్షం అయ్యాడు. ఒంటరిగా , అనుమనితుడుగా ఉన్న బాలుడిని గమనించిన రైల్వే శాఖ పోలీస్ సిబ్బంది బాలుడు ని చేరదీసి హౌరా లోని స్థానిక “ITINDA Community Development Society” అనే చైల్డ్ కేర్ సంస్థలో బాలుడిని జాయిన్ చేశారు. అనంతరం ఇటీవల హౌరాలోని డిసిపియు, సిడబ్ల్యూసి అధికారులు “ఘర్ పోర్టల్” లో వివరాలు నమోదు చేస్తూ ఉండగా అతడు ఇచ్చిన అస్పష్టమైన సమాచారంతో బాలుడిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా అని ప్రాథమికంగా గుర్తించిన హౌరా అధికారుల బృందం ఏలూరు జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్య చక్రవేణినీ ఫోన్లో సంప్రదించి బాలుడు వివరాలు తెలుసుకునేలా వీడియో కాల్ ఏర్పాటు చేశారు. బాలుడితో మాట్లాడిన ఏలూరు జిల్లా డిసిపివో అతని తల్లిదండ్రుల పేర్లు, వూరు వంటి వివరాలు ఏమన్నా కొన్ని గుర్తు చేసుకోమని కోరగా తాను కె.ఆర్ పురం పరిధిలోని కోయ గిరిజన వర్గానికి చెందిన వాడినని బాలుడు తెలిపారు.
దీనితో ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాలతో జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.పద్మావతి పర్యవేక్షణలో జిల్లా డిసిపివో సూర్య చక్ర వేణి ఆధ్వర్యంలో బాలుడి ఫోటోతో ఏలూరు జిల్లా లోని ఐసీడీఎస్, సిడిపివోల సిబ్బంది సమన్వయంతో పలు గిరిజన హాస్టళ్లు సహా పలు గ్రామాల్లో విచారణ చేపట్టారు. చివరకు బుట్టాయిగూడెంలో బాలుడి తల్లిని గుర్తించారు. అనంతరం బుట్టయిగూడెం చేరుకున్న సిబ్బంది బాలుడి తల్లి , కొడుకులతో గ్రూప్ విడియో కాల్ ఏర్పాటు చేసారు.దీనితో బాలుడు తల్లిని గుర్తించడంతో ఆ బాలుడిని ఏలూరు జిల్లా పంపేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలని హౌరా పోలీసు అధికారులు కోరగా సంబంధిత వివరాలను పంపారు. దాంతో బాలుడిని ఏలూరు జిల్లాకు పంపించేలా అనుమతి ఇస్తూ హౌరా బాలల సంరక్షణ సమితి వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జూలై, 8వ తేదీ సోమవారం ఉదయం సంబంధిత అధికారుల పర్యవేక్షణలో బాలుడిని రైలు ప్రయాణం ద్వారా సిబ్బంది ఏలూరు కు తీసుకువచ్చి శనివారపు పేటలోని జిల్లా బాలల సంరక్షణ సమితి ముందు హాజరు పరిచారు.
అనంతరం మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమక్షంలో బాలుడిని అతని తల్లికి క్షేమంగా అప్పగించారు. స్థానిక అంగన్వాడి వారి ద్వారా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుని ఏదైనా వృత్తి విద్యా కోర్సులు ఆబాలుడకు నేర్పించాలని డి పి పి ఓ ను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. అయితే సుదీర్ఘ కాలంగా దూరం అయిన కొడుకు ఈరోజు అధికారుల కృషి వల్ల తిరిగి తన వద్దకు చేరటంతో ఆ తల్లి ఎంతో సంతోషపడింది.ఈ సందర్భంగా బాలుడి వివరాలు గుర్తించి క్షేమంగా తల్లికి అందించిన ఏలూరు జిల్లా డిసిపివో, ఐసీడీఎస్ సిబ్బందిని పలువురు అభినందించారు.
కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, డిసిపివో సి హెచ్ సూర్య చక్ర వేణి, బుట్టాయగూడెం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఝాన్సీ, డిసిపియు ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in