Eluru: జూలై 09… గర్భస్ధ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, అటువంటి పరీక్షలు చేసిన వారికి చేయించుకున్నవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.
మంగళవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం – 1994 అమలుపై జిల్లాస్ధాయి మల్టీమెంబర్ అప్రాప్రియేట్ అధారిటీ సలహాకమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ గర్భస్ధ శిశువును కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ, రెవిన్యూ, పోలీస్, అధికారులు సమన్వయంతో పనిచేసి గర్భస్ధ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసి పీఎన్ డిటి) చట్టం పటిష్ట అమలుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పీసి పీఎన్ డిటి చట్టం అమలుతీరు, స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్, డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలను ఎన్ జివోల ప్రతినిధుల సమన్వయంతో సంబందిత అధికారులు ముమ్మరం చేయాలన్నారు.
జిల్లాలో గుర్తింపు పొందిన స్కానింగ్ సెంటర్లలో ఆల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలను లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. స్కానింగ్ ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.
మరి ముఖ్యంగా మెడికల్ షాపుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఆదేశాలు ప్రకారం మందుల విక్రయం నిర్వహణ చేపడుతున్నదీ లేనిదీ డ్రగ్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. వైద్యులు ఇచ్చిన మందుల చీటీ ప్రకారమే మెడికల్ షాపుల్లో సంబంధిత మందులు విక్రయించాలన్నారు. దీనిపై సంబంధిత అదికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాలని తనిఖీలలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజలు ఎట్ట పరిస్ధితిలోను డాక్టర్ సలహా మేరకే మందులను వేసుకోవాలే తప్పా షాపుల్లో మందులు కొని వేసుకోవడం వల్ల వచ్చే అనర్ధాలపై సంబంధిత అధికారులు అవగాహన కార్యక్రమంలో వివరించాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో ఆర్ఎంపి డాక్టర్ల యొక్క వైద్య చికిత్సపై కూడా సంబంధిత అధికారులు ఆరా తీయాలని తెలిపారు.
ఈ సందర్బంగా గత కమిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. బాలిక సంరక్షణకు గ్రామస్ధాయిలో ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీల సిబ్బంధిని బాగస్వామ్యం చేయాలని సూచించారు. అలాగే 18 సంవత్సరాలు దాటిన బాలికలకు, గర్భిణీస్త్రీలకు లింగ నిర్ధారణ స్కానింగ్ పై అవగాహన కల్పించాలని తరచూ క్షేత్రస్ధాయిలో అధికారులు అవగాహన కార్యక్రమాలను పరిశీలించాలన్నారు.
సమావేశంలో అధనపు ఎస్పీ స్వరూపరాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. ఎస్. శర్మిష్ట, డిఐవో డా. నాగేశ్వరరావు, ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, డిసిపివో సూర్యచక్రవేణి, జిల్లా రెడ్ క్రాస్ సంస్ధ చైర్మన్ బి.వి. కృష్ణారెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డా. రాజేష్, పలువురు వైద్యులు, ఎన్ జివోలు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in