Eluru August 03:జిల్లాలో పేదల గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గృహ నిర్మాణ శాఖాధికారులను ఆదేశించారు.
జిల్లాలో పేదల గృహ నిర్మాణ పనులపై స్థానిక కలెక్టరేట్ నుండి మండల స్థాయిలోని గృహనిర్మాణ శాఖ సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పధకాల కింద లక్షా 3 వేల 264 ఇళ్లను పేదలకు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో 36 వేల 480 ఇళ్ళు పూర్తిఅయ్యాయన్నారు. 45 వేల 703 గృహాలు వివిధ దశలలో ఉన్నాయన్నారు. 21 వేల 806 గృహాలు ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. పేదల గృహ నిర్మాణ పనుల ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా, వీటి నిర్మాణ పనులు వేగవంతం చేసి, నూరు రోజులలో లక్ష్యాలను పూర్తిచేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాలో వివిధ దశలలో ఉన్న ఇళ్ళ నిర్మాణ పనులను జిల్లా వ్యాప్తంగా రోజుకు 337 ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న దశ నుండి తదుపరి దశకు తీసుకువెళ్లాలని, అదేవిధంగా రోజుకు 41 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా మండలాల వారీగా లక్ష్యాలను నిర్ణయించడం జరిగిందన్నారు. మండల స్థాయి గృహ నిర్మాణ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది వారికి కేటాయించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాదించాల్సిందేనన్నారు. ప్రస్తుత రోజుకు సంబంధించి లక్ష్యసాధనలో వెనుకబడితే, మరుసటి రోజు లక్ష్యాలతో కలిపి రెండురోజుల లక్ష్యాలను సాధించాలన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని తాను ప్రతీరోజు సమీక్షిస్తానని, లక్ష్య సాధనలో వెనుకబడిన అధికారులు, సిబ్బందిపై చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్. శ్రీనివాసరావు, ఈఈ లు జి. రామకృష్ణ, డి.రమాకాంత్, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in