Eluru August 07 : రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి సూచించిన అంశాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రకరించి ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి బాటలో పయనింపజేసేందుకు మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలోని ప్రతీ కుటుంబం జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు ముందుగా మండలంలో పేదల వివరాలను ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలన్నారు. వారికి ప్రభుత్వం నుండి అందవలసిన సంక్షేమ కార్యక్రమాలు పై సర్వే చేయాలన్నారు. అనంతరం ఆ గ్రామాలలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతీ పేద కుటుంబాన్ని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చేలా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగేలా మండల ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు తమ మండలంలో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు పూర్తిగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. మండలంలో నిరుద్యోగ యువత వివరాలను సేకరించి, వారికి అభిరుచి కలిగిన అంశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నారు. మండలంలో త్రాగునీరు, పారిశుధ్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, ఆర్డీఓ ఎన్ .ఎస్.కె. ఖాజావలి, డి ఈఓ అబ్రహం,ఆర్ ఐ ఓ చంద్రశేఖర్, డీఆర్డీ ఏ పీడీ విజయరాజు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, డ్వామా పీడీ పి . రాము, ఉప రవాణా కమీషనర్ శాంతికుమారి, డిసిహెచ్ ఎస్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. నాగేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in