Eluru August 08: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుండి సింగిల్ విండో ద్వారా అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా జిల్లాను పారిశ్రామికరంగంలో రాష్ట్రంలో ముందువరుసలో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సింగిల్ విండో పధకంలో జిల్లాలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమ ఏర్పాటుకు 77 దరఖాస్తులు అందగా వాటిలో 73 దరఖాస్తులు ఆమోదించడం జరిగిందన్నారు. నిబంధనల మేరకు లేని ఒక దరఖాస్తును తిప్పివేయడం జరిగిందని, పెండింగ్లో ఉన్న మూడు దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పిఎంఈజిపి కింద జిల్లాలో 100 దరఖాస్తులు అందగా వాటిలో నిబంధనల మేరకు లేని 5 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందని, బ్యాంకర్ల వద్ద పెండింగ్ లో ఉన్న 19 దరఖాస్తులను వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు.
ఫాప్సి జిల్లా కోఆర్డినేటర్ ఎన్ . వెంకటేశ్వరరావు జిల్లాలో ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుండి 20 కోట్లరూపాయలు ప్రోత్సాహాకాలుగా అందవలసి ఉందని, వాటిని మంజూరు చేయవలసిందిగా కోరగా, వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు తాము పండించిన పంటలకు మరింత మెరుగైన రాబడి అందించేలా జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కు పరిశ్రమల శాఖాధికారులు, బ్యాంకర్లు ప్రోత్సహించాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలనీ పరిశ్రమల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఆదిశేషు, ఏడి సుమధురవాణి, డీఆర్డీ ఏ పీడీ విజయరాజు, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ఉప రవాణా కమీషనర్ శాంతికుమారి, కాలుష్య నియంత్రణమండలి ఈఈ వెంకటేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in