Eluru August 1 : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి గురువారం ముసునూరు మండలం కాట్రేనిపాడు విచ్చేసిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి
కొలుసు పార్థసారథి గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి, వారు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకించి, అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాట్రేనిపాడు గ్రామంలోని పేరిచర్ల వెంకటేశ్వరమ్మ తాను పేదరికంలో ఉన్నానని, తనకు స్వంత ఇల్లు లేదని, తనకు ఇల్లు మంజూరు చేయాలనీ కోరగా, పరిశీలించి ఇంటి స్థలం మంజూరు చేయాలనీ రెవిన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు తమకు గతంలో టిడిపి ప్రభుత్వం సమయంలో పేదలకు స్థలాలు మంజూరు చేశారని , వాటిల్లో కొంతమంది ఇళ్ళు నిర్మించుకున్నారని, కొంతమంది ఇల్లు ప్రారంభదశలో ఉండగా, తదనంతరం వచ్చిన వై.ఎస్.ఆర్.సిపి నాయకులు సదరు ఇళ్లకు బిల్లులు చెల్లించలేదని, ప్రారంభ దశలో ఇళ్ల ఉన్నవాటిని కూడా నిర్మాణ పనులు పూర్తి చేయనివ్వలేదన్నారు. తమ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ సమస్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉందని, తాను ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, సదరు బిల్లులు చెల్లింపులకు, ప్రారంభ దశలో ఉన్న ఇళ్లకు కొత్త ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. గ్రామంలో స్వంత ఇల్లు లేని పేదల వివరాలు తనకు సమర్పించాలన్నారు. 2025, మార్చి నెల తరవాత కేంద్ర ప్రభుత్వం పేదల ఇళ్ల యూనిట్ కాస్ట్ ను 4 లక్షల రూపాయలకు పెంచుతుందని, ఆ సమయంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.
గ్రామంలోని ప్రజల ఇళ్ల వద్దకు వెళుతున్న మంత్రికి ప్రజలు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఆర్డీఓ వై. భవానీశంకరి, తహసీల్దార్ ఎమిలీ కుమారి, డివిజినల్ పంచాయతీ అధికారి సుందరి, ఎంపిడిఓ పద్మావతి, ఈఓ పి ఆర్డీ ఎస్.వి.శ్రీనివాసరావు, అర్ డబ్ల్యూఎస్ ఏ ఈ సత్యప్రసాద్, సర్పంచ్ జి. సుహాసిని, జెడ్పిటిసి ప్రతాప్, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in