Jangareddygudem: జులై, 19: జిల్లాలో వరద ప్రమాదం ముగిసే వరకు అధికారులు, సిబ్బంది అందరూ పూర్తి అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో వరద విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాలలో జిల్లా ఎస్పీ, ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి, ఇతర జిల్లా అధికారులతో పర్యటించి వరద పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతర వరద అత్యవసర పరిస్థితిపై తీసుకోవలసిన చర్యలపై జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద ప్రభావిత గ్రామాలలో సహాయక చర్యల నిమిత్తం రహదారి మార్గాలను యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేయాలన్నారు. వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జిల్లా యంత్రాంగంను ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది అందరూ వరద సమయంలో ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 24 గ్రామాలు ప్రస్తుతం వరద ప్రభావానికి గురయ్యాయని, ఆయా గ్రామాలలోని ప్రజలను వరద సహాయ కేంద్రాలకు తరలించి భోజన, వసతి సదుపాయాలు కల్పించాలన్నారు. ముంపునకు గురైన గ్రామాలలోని గర్భిణీలను దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలని, పిల్లలను, వృద్దులకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర పరిస్థితికి అవసరమైన లైఫ్ బొట్లు, లైఫ్ జాకెట్లు, గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. వరద తీవ్రత ఉన్న ప్రతీ గ్రామంలోనూ స్థానిక వి ఆర్ ఓ, పంచాయతీ కార్యదర్శి, పోలీసు సిబ్బంది, ఫ్లడ్ ఆపరేషన్ లో పాల్గొనేందుకు ఆసక్తి గల చురుకుగా స్పందించే వ్యక్తులతో బృందంగా ఏర్పాటు చేసి, అత్యవసర సమయంలో వారి సేవలు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రభావిత గ్రామాలలో త్రాగునీటి ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యవసరంగా 80 వేల వాటర్ ప్యాకెట్లను కుక్కునూరు, వేలేరుపాడు లలో సిద్ధంగా ఉంచాలని, ఆయా గ్రామాలకు వాటర్ ట్యాంకర్లను పంపాలని శుక్రవారం సాయంత్రంలోగా సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వరద సహాయ కేంద్రాల వద్ద పారిశుధ్య కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్ళు , పంటలు, తదితర నష్టాలపై అధికారులు నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వరద సమయంలో ప్రజలు సమాచారం తెలుసుకొనుటకు లేదా తమ సమస్యలను తెలియజేసేందుకు జిల్లా స్థాయిలో 24 గంటలూ పనిచేసే కమాండ్ కంట్రోల్ రూమ్ ను టోల్ ఫ్రీ ఫోన్ 1800 233 1077 తో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ విపత్తు నిర్వహణపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా అధికారి స్థాయి నుండి గ్రామంలోని చివరి స్థాయి సిబ్బంది వరకు అందించేందుకుగాను పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలన్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయినవెంటనే సంబంధిత సిబ్బంది అధికారులు విపత్తు నివారణ నిర్వహణను ప్రారంభించి ఎటువంటి ప్రాణ ఆస్థి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యూనిఫామ్ సిబ్బంది వరద అత్యవసర పరిస్థితిలో
ధైర్యంతో, వేగమైన స్పందనతో విపత్తు నిర్వహణ విధులు నిర్వర్తించాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎద్దువాగు, పెద్దవాగు, ఎర్రకాల్వ లు పొంగుతున్నాయని, వాటినుండి నీటి విడుదల స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నీటి విడుదల సమాచారాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం 12 గంటల ముందుగా తెలియజేయాలన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుందన్నారు. వరద సమయంలో అత్యవసర సేవల నిమిత్తం గ్రామస్థాయిలో వి ఆర్ ఓ, పంచాయతీ కార్యదర్శి, ఏ ఎన్ .ఎం., సచివాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది బృందంగా ఏర్పాటుచేయడం జరిగిందని, వారు సమన్వయంతో ఆ గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఆసుపత్రులలో పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీ వీనం మందులు అందుబాటులో ఉంచాలన్నారు.
ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి ఎం. సూర్యతేజ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులందరూ వారి సిబ్బందికి కేటాయించిన విధులను దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. గిరిజన ప్రాంతాలలో వాగులు పొందుతుండడంతో కాజ్ వే ల వద్ద రాకపోకలు లేకుండా బారికేడ్లు ఏర్పాటుచేయాలన్నారు.
సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె. అద్దయ్య , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ట, డిపి ఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, పశుసంవర్ధక శాఖ జెడి నెహ్రు బాబు, ఇరిగేషన్ ఎస్ ఈ ప్రకాష్, ఐ సి డి ఎస్ పీడీ పద్మావతి, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in