Kukunoor: జులై, 8 : అంగన్వాడీ కేంద్రాలలో నిర్దేశించిన మెనూ ని కచ్చితంగా అమలు చేసి, మంచి పౌషకాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

కుక్కునూరు మండలం మాధవరం పంచాయతీ దామచర్ల లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలో జిల్లా కలెక్టర్ సోమవారం పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం సదరు ఆహారాన్ని తాను స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. ఉదయం పాలు, మధ్యాహ్నం భోజనంలో కూర, సాంబారు, కోడిగుడ్డు అందించాలన్నారు. తాను వివిధ కార్యక్రమాల పర్యటనలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, మెనూ ప్రకారం భోజనం అందించకపోతే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఎల్లప్పగూడెం నకు చెందిన ప్రజలు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో నగదు, ఇల్లు అందలేదని తెలియజేయగా, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఆర్డీఓ కె. అద్దయ్య, తహసీల్దార్, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in