Meekosam: జూలై 08 ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్ధ(మీకోసం)లో వచ్చిన ప్రజల సమస్యల అర్జీలను పెండింగ్ లేకుండా త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్ధ(మీకోసం)కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, డిఆర్ఓ డి. పుష్పమణి, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, డిప్యూటీ కలెక్టర్లు భాస్కరరావు, ముక్కంటి, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె. ఖాజావలి తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్ధ(మీకోసం)లో 234 అర్జీలు స్వీకరించడం జరిగిందని జెసి తెలిపారు. ఈ కార్యక్రమంలోజాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి అందిన అర్జీలను సంబంధత అధికారులు నాణ్యతతో నిర్ధేశిత కాలపరిమితిలో పరిష్కరించాలన్నారు. ఈ విషయంలో ఎటువంటి అలసత్వానికి తావులేదన్నారు. అర్జీలు రీ ఓపెనింగ్ కు రాకుండా సంతృప్తికరమైన పరిష్కరాలు అందించాలన్నారు. రేషన్ కార్డుద్వారా అందిస్తున్న బియ్యాన్ని త్వరితగతిన పంపిణీని పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు.
అందిన అర్జీలలో కొన్ని… మండవల్లి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ తమ భూమిని ఆక్రమించుకొని భూమిలోకి తమను రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని, ప్రభుత్వం వారు తమ భూమిని సర్వేచేయించి దౌర్జన్యం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన దుర్గారావు తమ భూమికి వేరేవారి పేరు ఆన్ లైన్ నందు నమోదు అయిందని దీనిని సరిచేసి తమ భూమిపై తమ పేరును ఆన్ లైన్లో నమోదు చేయాలని అర్జీ అందజేశారు. ద్వారకాతిరుమల మండలం హెచ్ లింగంపాలెం కు చెందిన శ్రీనివాసరావు రెవిన్యూ ఏరియాల్లో ఉన్న కొబ్బరి, నిమ్మ, వగైరా పంటల మధ్యనుండి కరెంటు లైను తమ అనుమతి లేకుండా ఎపి ట్రాన్స్ కో వారు కరెంటు లైను వేసినారు. తమకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు కావున తమ భూమిలోని ఉన్న పంటకు నష్టపరిహారం ఇప్పించమని అర్జీ అందజేశారు.
కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in