Musunuru August 01: చింతలపూడి ఎత్తిపోతల పథకంను త్వరలో పూర్తిచేసి నూజివీడు ప్రాంత రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణం శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా స్థానిక ఎంపిపి పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వాటిలో ప్రధానమైన అయిదు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నారని, వాటిలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఒకటని మంత్రి చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఈ రోజు నుంచే మళ్లీ ప్రారంభిస్తున్నామని, నూజివీడు ప్రాంతంలో నాగార్జునసాగర్ కు సంబందించిన కాలువలు ఇప్పటికే ఉన్నందున చింతలపూడి ఎత్తిపోతల పధకం త్వరలో సాగునీరు అందించి నూజివీడు ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తామని మంత్రి చెప్పారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో మల్లవల్లి లో పారిశ్రామికవాడ ఏర్పాటులో అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ కంపెనీలు తమ పరిశ్రమలని ఏర్పాటు చేశాయని కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో అవి మన రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయాయి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో మళ్లీ మల్లవల్లిలో పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించాయి అన్నారు దీంతో ఈ ప్రాంత యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మంత్రి చెప్పారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో నిరంకుశ పాలన కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి అనేదే జరగలేదని, బాధ్యత రాహిత్యమైన పాలనకు ఇది నిదర్శనం అన్నారు. గతంలో తమ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ళు మంజూరు చేసిన వారి బిల్లులను గత ప్రభుత్వం చెల్లించలేదని, కొంతమందికి ప్రారంభ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేయలేదన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఇళ్ల బిల్లులు చెల్లింపులు, ఇళ్ల నిర్మాణం ప్రారంభ దశలో ఉన్న వారికి కొత్త ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మూడు నుండి నాలుగు వేలకి పెంచామన్నారు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని గుర్తించి త్వరలో పెన్షన్ అందిస్తామని మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధుల, పేదల ఆత్మగౌరాన్ని పెంచాయన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని తక్కువ సమయంలోనే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో తాము అధికారం చేపట్టిన వెంటనే 16,700 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నామని, అన్నా క్యాంటిన్లను ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభిస్తున్నామని మంత్రి చెప్పారు. ముసునూరు మండలంలో డ్రైనేజీ రోడ్ల సమస్యను రెండు నెలల్లో పరిష్కరిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఆయిల్ పామ్ తోటలలో విద్యుత్ తీగల సమస్యలపై, గ్రామ ప్రజలు విద్యుత్ బిల్లుల సమస్యలపై మంత్రికి విన్నవించుకోగా వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మండలంలో లింక్ రోడ్లు, ఎస్.సి. కాలనీలో ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి చెప్పారు.
మంత్రి వెంట జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఆర్డీఓ వై. భవానీశంకరి, తహసీల్దార్ ఎమిలీ కుమారి, డివిజినల్ పంచాయతీ అధికారి సుందరి, ఎంపిడిఓ పద్మావతి, ఈఓ పి ఆర్డీ ఎస్.వి.శ్రీనివాసరావు, అర్ డబ్ల్యూఎస్ ఏ ఈ సత్యప్రసాద్, సర్పంచ్ జి. సుహాసిని, జెడ్పిటిసి ప్రతాప్, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in