Nuzvid:ఏలూరు/నూజివీడు, జులై, 1 : ఎన్నికల సమయంలో నూజివీడు పట్టణంలో అభివృద్ధికి ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
స్థానిక గాంధీనగర్ లో సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి పార్థసారధి స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ప్రజలకు పాలన అందిస్తుందన్నారు. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఆర్ధిక, పరిపాలన, ప్రాంతాల విధ్వంసం జరిగిందని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తీవ్ర సమస్యలతో అగమ్యగోచర పరిస్థితిలో ఉందని అటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి బాటలో నడపగలిగేది ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనన్నారు. ఆ నమ్మకంతోనే ప్రజలు తమను ఆదరించారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన నష్టంపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి 5 ప్రాధాన్యత హామీలపై ముఖ్యమంత్రి సంతకం చేసారన్నారు. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను వెయ్యి రూపాయలకు పెంచామని, అనంతరం 2 వేల రూపాయలకు చేశామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ ను 2 వేల రూపాయల నుండి 3 వేల రూపాయలు చేసేందుకు 5 సంవత్సరాల సమయం తీసుకుందని, తమ ప్రభుత్వం 3 వేల రూపాయల పెన్షన్ ను 15 రోజులలో 4 వేల రూపాయలకు పెంచి, గత 3 నెలల బకాయిలతో సహా 7 వేల రూపాయలను పెన్షన్ లబ్దిదారులకు అందించామన్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటలింగ్ చట్టాన్ని రద్దు చేశామన్నారు. గత పాలనలో జరిగిన విధ్వంసం చూసిన ప్రజలలో నైరాశ్యం పోగొట్టి, వారికి భవిష్యత్తు పట్ల భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు.
రాష్ట్రంలో 203 అన్నా కాంటీన్లు ఉన్నాయని, వాటిలో 183 కాంటిన్లకు స్వంత భవనాలు ఉన్నాయని, వాటిని ఆగష్టు, 16వ తేదీ నాటికి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందించేలా కాంట్రాక్టర్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామన్నారు.
నూజివీడు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి పార్థసారథి చెప్పారు. నూజివీడు లో డ్రైనేజ్, రోడ్లు నిర్మాణాన్ని దశల వారీగా చేపడతామన్నారు. త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 11 కోట్ల రూపాయలతో, పైపు లైన్ల మరమత్తులు, కొత్త లైన్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నామన్నారు. పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రతీ రోజు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. త్రాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా అందించాలన్నారు. త్రాగునీరు సరఫరా, పారిశుధ్యం పనులలో మునిసిపల్ సిబ్బంది ఎటువంటి అలసత్వం వహించవద్దని, ప్రతీరోజు వార్డులలో తిరిగి పనిచేయాలన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నూజివీడు పట్టణానికి రింగ్ రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. పట్టణంలోని ఇండోర్ స్టేడియం పునర్నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. టిడ్కో గృహాలను లబ్దిదారులకు త్వరలో అందిస్తామన్నారు.
కార్యక్రమంలో నూజివీడు ఇంచార్జి ఆర్డీఓ ఎం. ముక్కంటి, ఇంచార్జి మున్సిపల్ కమీషనర్ లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in