Nuzvid August 2 : నూజివీడు డిపో నుండి డిమాండ్ ఉన్న రూట్లలో అదనపు బస్సు సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.
స్థానిక నూజివీడు బస్సు డిపో లో నూజివీడు నుండి బెంగళూరుకు 2 నూతన బస్సు సర్వీసులను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నూజివీడు నుండి హైదరాబాద్, వైజాగ్, శ్రీకాకుళం వంటి దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు కావాలని ప్రజలు కోరుతున్నారని, త్వరలో ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీస్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ బస్సులతో పోటీగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా నూజివీడు బస్సు స్టాండ్ లో ప్రయాణీకులకు మరిన్ని సదుపాయాలు అందిస్తామన్నారు. నూజివీడు ప్రాంతంలో మామిడి, మొక్కజొన్న, ఉద్యాన పంటల మార్కెటింగ్ సదుపాయం నిమిత్తం సుదూర ప్రాంతాలకు మార్కెటింగ్ సౌకర్యం ఉన్న ప్రాంతాలకు కూడా రవాణా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రి మాట్లాడుతూ యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించదగిన సమస్యలపై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకంపై మంత్రి మాట్లాడుతూ ఈ పధకానికి సంబంధించి విధివిధానాలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ఎప్పటి ప్రారంభించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకం ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన బస్సును మంత్రి పార్థసారథి స్వయంగా నడిపారు.
కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in