Palacole: జూన్ 30,2024. నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
అన్ని డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలి, సుఖ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు కృషి చెయ్యాలి.
ఆకస్మిక తనిఖీలు చేస్తా, వైద్య సేవల్లో లోపాలుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుని, ప్రక్షాళన చేస్తా.
జిల్లా కలెక్టరు సి.నాగరాణి …
ఆదివారం పాలకొల్లు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టరు సి.నాగరాణి ఆకస్మిక తనిఖీ చేసి, పలు వైద్య విభాగాలను పరిశీలించారు. ఓపి వార్డులను, ప్రసూతి వార్డులను పరిశీలించి, అక్కడ ఉన్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలు సౌకర్యాలను జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వార్డులో ఒక శిశువును జిల్లా కలెక్టరు ఎత్తుకుని ముద్దాడి, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధులకు హాజరయ్యే వారి పేర్లు, సమయాన్ని తెలిపే డిస్ ప్లే బోర్డును, రిజిస్టర్లను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే డెలివరీ కేసులు, ఒపీ కేసులు, హాస్పటల్లో ఇన్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్యను ఆరా తీశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని, హాస్పటల్ కి వచ్చిన ప్రతి రోగిని చిరునవ్వుతో పలకరించాలని, సగం రోగం నయమవుతుందని ఆమె అన్నారు. అతిసార వ్యాధి, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటివరకు మా హాస్పిటల్ కు ఒక్క డయేరియా కేసు రాలేదని వైద్యాధికారి తెలపగా, అయినా కూడా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఏటువంటి కేసు వచ్చినా వెనువెంటనే జాయిన్ చేసుకుని అవసరమైన వైద్య సేవలు, వైద్య చికిత్సలు అందించాలన్నారు. తాను తరచూ ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో లోపాలు కనిపించినా, రోగులు నుండి ఒక్క ఫిర్యాదు వచ్చినా సంబంధిత వైద్యాధి కారులను, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి అవసరమైన వైద్య సేవలు అందించుటకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జూలై 01 తేదీ నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వామ్యంతో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ డయేరియా, తదితర సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించవలసిన బాధ్యత మీపై ఉందని జిల్లా కలెక్టరు సి.నాగరాణి తెలిపారు.
ఆకస్మిక తనిఖీలు సందర్భంలో హాస్పటల్ ఇంచార్చి సూపర్డెంటు డా.ఓ.రవికుమార్, డ్యూటీ వైద్యులు డా. రిచర్సు బూన్, హెడ్ నర్సు యస్.కె. ఫాతిమా, వివిధ విభాగాల వైద్య సిబ్బంది, నర్సులు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in