Veirpadu: జులై, 8 : రెండు మూడు రోజులు నిరంతరాయంగా వర్షాలు పడుతూ ఉంటె అధికారులందరూ వరద ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు.

స్థానిక వేలేరుపాడు ఎంపిడిఓ కార్యాలయంలోని సమావేశపు హాలులో సోమవారం వరద ముందస్తు జాగ్రత్త చర్యలు, వరద ప్రమాదానికి ముందు , వరద సమయంలో, అనంతరం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. . ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుతం ఎటువంటి వరద ప్రమాదం లేనప్పటికీ, వర్షాకాల సీజన్లో గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలపై అధికారులను అప్రమత్తం చేసేందుకు ఇప్పటికే రెండు సార్లు అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. . గోదావరి నదికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వెంటనే వరద ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించాలని కానీ, నివారణ చర్యలు తీసుకునేందుకు కేవలం కొంత సమయమే ఉంటుందని, కావున అప్పటివరకు వేచి ఉండకుండా రెండు మూడు రోజులపాటు నిరంతరాయంగా వర్షాలు కురుస్తూ ఉంటె వరద వచ్చే అవకాశం ఉంటుంది కావున అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు సిద్ధం కావాలన్నారు. ముందుగా మొదటి, రెండవ, మూడవ ప్రమాద హెచ్చరికలకు వరద ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించి, ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వేలేరుపాడు లో 69 మంది 6 నుండి 9 నెలల గర్భిణీలు ఉన్నారని, వారితో పాటు బాలింతలు, చిన్నపిల్లలు, మంచానికి పరిమితమై లేవలేని పరిస్థితులలో ఉన్న ముసలివారిని వరద ప్రమాదంపై వారికి అవగాహన కలిగించి ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేయాలన్నారు. వరద సహాయక కేంద్రాలు ఎక్కడ ఏర్పాటుచేయాలి, అక్కడ ప్రజలకు భోజన, వసతి సదుపాయాలను పరిశీలించాలన్నారు. ముంపునకు గురయ్యే గ్రామాలలో ప్రజలకు పంపిణీ చేసేందుకుగాను 3 నెలలకు సరిపడా బియ్యం, కందిపప్పు, వంటనూనె వంటి నిత్యావసర సరుకులను ఆయా గ్రామాలలోని సురక్షిత ప్రాంతాలలో సిద్ధం చేసుకోవాలన్నారు. లైఫ్ బోట్లు , లైఫ్ జాకెట్లు, రవాణా వాహనాలు, గజఈతగాళ్ళను సిద్ధం చేసుకోవాలని, అదేవిధంగా ప్రమాద హెచ్చరికలు, తీసుకోవలసిన చర్యలను ప్రజలకు చేరవేసేందుకుకే అవసరమైన సమాచార వ్యవస్థ ఏర్పాటుచేసుకోవాలన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో శిధిలావస్థలో ఉన్న భవనాలు, కట్టడాలను పరిశీలించి, అందులో నివసించే వారిని వరద సమయంలో తప్పనిసరిగా సహాయక కేంద్రాలకు తరలించాలన్నారు. గోదావరి నది తీరప్రాంతంలో బలహీనంగా నది గట్లను పరిశీలించి వాటిని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత వరద సమయంలో ఎదుర్కున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వరద సమయంలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం సంభవించకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఎం. సూర్యతేజ, ఆర్డీఓ కె. అద్దయ్య, ఉప రవాణా కమీషనర్ శాంతకుమారి,డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ఆర్టీఓ శ్రీహరి, తహసీల్దార్ చిన్నారావు, ఎంపిపి లక్ష్మీదేవి, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in