Velairpadu:జూలై,19: పెద్దవాగు వరద ముంపునకు గురైనా వేలేరుపాడు మండలం అల్లూరినగర్ వాసులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం పరామర్శించి బాధితుల్లో భరోసాను నింపారు.
పెద్దవాగు వరద ముంపునకు గురైనా వేలేరుపాడు మండలం అల్లూరినగర్ వాసులను శుక్రవారం ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఏం. సూర్యతేజ, ఆర్డీఓ కె. అద్దయ్య, వివిధ శాఖల అధికారులతో కలిసి పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వరద సహాయక కేంద్రాలలో బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కారు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు బైక్ మీద ప్రయాణించి బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, వరద సహాయక కేంద్రాలకు రావలసిందిగా కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదాలు జరగవచ్చని, అందరూ తప్పనిసరిగా వరద సహాయక కేంద్రాలకు రావాలన్నారు. వరదల సమయంలో సహాయక కేంద్రాలే సురక్షితమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పెదవాగు బ్రిడ్జ్ పై గండి పడిన ప్రాంతాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖధికారులను కలెక్టర్ ఆదేశించారు. పెదవాగు పై ప్రాంతంలో వరద నీటిని విడుదల చేసే సమయంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున, నీరు విడుదల చేసే సమయానికి కనీసం 12 గంటల ముందుగా తెలియజేసినట్లయితే ప్రమాదాన్ని నివారించడంతోపాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుంటుందని ఇకనుండి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణా ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ సాల్మన్ రాజు, డిపివో టి. శ్రీనివాస విశ్వనాధ్, తహశీల్దారు, డిఎస్పీ తదితరులు ఉన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in